rakshabhandhan
|

A challenge for every mother

sreelatha

అమ్మ లోని “అ ” ని నాన్న లోని “న్న ని కలిపి దేవుడు ఆడపిల్లకి ఇచ్చిన గొప్ప వరమే అన్నయ్య. ఆడపిల్లకి పుట్టింటి ఆదరణ పంచేది అమ్మా నాన్న తర్వాత అన్నదమ్ములే అమ్ములు అని అమ్మ ఎపుడు చెప్తుంటే చిన్నప్పుడు అర్ధం అయేది కాదు. కాని వయసు పెరిగే కొద్దీ పెరుగుతున్న అన్నయ్య ప్రేమ , నన్ను ఒక కవచంలా కాపాడే తన ఆదరణ చూస్తున్న నాకు అమ్మ చెప్పినది అక్షర సత్యం అని అర్ధం అయింది. నా చదువులో, కెరీర్ లో, చివరకి ఆడపిల్లల జీవితానికి ఎంతో ముఖ్యమైన జీవిత భాగస్వామి ని వెతకడం లో అన్నయ్య , నాన్న లానే భాద్యత తీసుకుని నాకు ఒక అందమైన జీవితాన్ని తీర్చి దిద్దుకునే ఆసరాగా నిలిచాడు. ఎన్ని జన్మలైనా నాకు మళ్ళీ తానే అన్నయ్య కావాలని నేను మొక్కుకోని రోజు లేదు నా జీవితంలో. ప్రతి సంవత్సరం రక్షాబంధన్ ని ఎంతో ఆనందం గా వెళ్లి అన్నయ్య కి రాఖీ కట్టి, అన్నయ్య ఇచ్చే వెలకట్టలేని ప్రేమకానుక తెచ్చుకోవడం తప్ప, నాకు ఇది కావాలి అని అడగవలిసిన అవసరం రానివ్వలేదు అన్నయ్య నాకు.

ఎల్లుండి రాఖీ, ప్రతి సంవత్సరంలా ఈ సారి నా మనసు ఆనందంతో తేలిపోవట్లేదు , అన్నయ్యఈ సారి నాకు ఏమి ఇచ్చి surprise చేస్తాడా అని ఆలోచించట్లేదు నేను. ఎందుకంటే నా మనసంతా చెప్పలేని ఆందోళనతో నిండిపోయింది , ఒక తల్లిగా తల్లడిల్లిపోయే సమస్యతో సతమతమైపోతున్న నాకు దారి చూపించగలిగే ఒకే ఒక వ్యక్తి నా అన్నయ్య ఇప్పుడు . నా ఈ ఆందోళనకి కారణం మా ఒక్కగానొక్క కూతురు శాన్వి. శాన్వి అంటే చెప్పాలంటే మాకన్నా మా అన్నయ్యకే ప్రాణం . అది పుట్టినప్పటి నుంచీ మేము దానికి కొన్న బొమ్మలు, బట్టలు ,బుక్స్ ఇలా ఏది చెప్పాలన్న చాలా తక్కువే. దాని వయసుకి తగ్గట్టు ఎపుడు ఏమి ఇష్టపడతాదో అర్ధం చేసుకుని అన్నీ అడగకముందే తెచ్చేసే ముద్దుల మామయ్య అంటే దానికి కూడా “దేవుడు మామయ్య” లాంటి వాడే.

అమ్మ ఎపుడూ అనేది ఆడపిల్లలు చాలా త్వరగ్గా ఎదిగిపోతారమ్మ , తల్లి తండ్రులాగా మనమే అది గమనించడంలో ఆలస్యం అవుతాది ఎందుకంటే మన కళ్ళకి వాళ్ళు ఎపుడు ఇంకా బొమ్మలతో ఆడుకునే బంగారు బొమ్మల్లానే కనిపిస్తారు కాబట్టి అని. నిజమే మా కూతురు కూడా మాకు ఇంకా చిట్టి పొట్టి మిరియాలు అంటూ ముద్దు ముద్దు మాటలు చెప్తూ ,పెద్ద పెద్ద కళ్ళని చక్రాల్లా తిప్పే బార్బీ బొమ్మలానే అనిపిస్తాది మరి.క్రిందటి నెలలో తన పుట్టినరోజు జరిగినపుడు మొదటి సారి అనిపించింది, అపుడే నా బంగారు తల్లికి 13 ఏళ్ళు వచ్చేసాయా అని. ఎందుకో ఆ రాత్రి ఏదో తెలియని అలజడి నన్ను నిద్రపోనివ్వకుండా చేసింది అనే చెప్పాలి , మొదటిసారిగా నాలోని తల్లితనానికి బెంగగా అనిపించింది. పొద్దున్న లేచాక నాలో నేనే నవ్వుకున్నాను ఇదేమీ సృష్టికి విరుద్ధం కాదు కదా , మాతృత్వానికి ఉన్న గొప్పతనమే ఇంత అనుకుని.

3 రోజుల క్రితం శాన్వి తన స్నేహితురాలి ఇంటికి వెళతాను అని, ఇద్దరం కలిసి చదువుకుంటాము, ఆన్ లైన్ క్లాస్ వల్ల చాలా డౌట్స్ ఉన్నాయి సబ్జెక్టు లో అంటే సరే అని నేనే దింపి వచ్చాను. ఉదయం లేచినప్పటి నుంచీ తన పనులు చూడడం, వండి పెట్టడం , కొంచెం సేపు దానితో కలిసి సినిమా చూడడం గత కొంత కాలం గా మా దినచర్య అదే ఇంకా ఆఫ్ లైన్ స్కూల్స్ మొదలు అవకపోవడం వల్ల . శాన్వి వెళ్లిన రెండో రోజే నాకు అర్ధం అయిన తియ్యని నిజం నా ఆలోచనలు, నా ప్రపంచం అన్నీ నా కూతురు చుట్టూనే అల్లుకుని పోయాయి అని, అవును మరి ఎపుడూ టైం సరిపోని నాకు అసలు పనే లేనట్టు అయిపొయింది హఠాత్తుగా. ఇపుడు అర్ధం అవుతుంది అమ్మ ఎపుడూ నువ్వు పెళ్లి అయిపోయాక మేము ఎలా ఉండాలి చిట్టితల్లీ నిన్ను వదిలి అని ఎందుకు అంటూ బాధపడేదో. సరే శాన్వి రూమ్ క్లీన్ చేసి కూడా చాలా రోజులు అయింది, ఈ మధ్య ఎపుడు వెళ్లి చేద్దాము అన్నా కంబైన్డ్ స్టడీస్ అనీ,
ఎగ్జామ్స్ అనీ అసలు నన్ను రూంలోకి రానివ్వడం లేదు. ఇంతకు ముందులాగా నాతో కలిసి సినిమా చూడడానికి కూడా ఇష్టం చూపించట్లేదు , ఇపుడు పిల్లల అభిరుచికి మనతో కలిసి ఏమి చూస్తారు అని నవ్వుకుని వదిలేసాను నేను కూడా. గజిబిజిగా పడేసి ఉన్న తన బట్టలు అన్నీ సర్ది , చిన్నప్పటి నుంచీ పక్కనే పెట్టుకుని పడుకునే తన బొమ్మ ( నీతుల్) ఇపుడు కూడా తన మంచం మీదే ఉండడడం చూసి మురిపెంగా నవ్వుకున్నాను. పక్కనే స్టడీ టేబుల్ మీద ఉన్న తన లాప్ టాప్ ఆఫ్ కూడా చేసి ఉండకపోవడంతో , పిచ్చి పిల్ల ఇది కూడా మర్చిపోయింది ఎపుడు నేర్చుకుంటాదో వస్తువులు జాగ్రతగా పెట్టుకోవడం అనుకుంటూ షట్ డౌన్ చేస్తున్న నేను ఒక క్షణం ఆలా ఆగిపోయాను.
డెస్క్ టాప్ పైన కనిపించిన ఆ ఫోటోనే నన్ను ఒక్క క్షణం నిర్ఘాంతపోయేలా చేసింది. శాన్వితో పాటు ఫోటోలో ఎవరో ఒక అబ్బాయి, అది కూడా తన బుగ్గ మీద ముద్దు పెడుతూ. నాకు చూసింది కలా నిజమా అని అర్ధం కాలేదు. ఫొటోలో ఉన్న అబ్బాయి జులపాల జుట్టు, కళ్ళలో ఏదో నిర్లక్ష్య ధోరణి,
సున్నితత్వం లేని మొహంతో ఎందుకో నాకు చాలా చెడ్డవాడిలా కనిపించాడు. బహుశా కూతురి పక్కన కనిపించే అబ్బాయి ఎవరైనా తల్లి కళ్ళకి అలానే కనిపిస్తాడేమో, దానికి అభద్రతా భావం , కూతురి భవిష్యత్తు గురించిన భయం కారణాలు కావొచ్చు.తను ఏదో చాట్ బాక్స్ కూడా అలానే ఓపెన్ చేసి వెళ్లిపోవడం తో మెల్లిగా కూర్చుని మెసెంజర్ లో ఒక్కో మెసేజ్ చదవడం మొదలు పెట్టిన నాకు కొంత సేపటికి వొళ్ళంతా చమటలు పట్టేసాయి. శాన్వి ఫ్రండ్స్ అందరూ టీనేజ్ లో ఉన్న పిల్లలే, ఇపుడిపుడే కొత్తగా ప్రపంచం చూస్తూ పెరిగే వయసు, కొత్తగా కనిపించే ప్రతి విషయం అద్భుతం గా అనిపించే మనసు . ఒక మెసేజ్ దగ్గర నా కళ్ళు ఆగిపోయాయి, అది తన క్లాసుమేట్ అన్విత పంపిన మెసేజ్. “మా అన్నయ్యకి నువ్వు అంటే చాలా ఇష్టం , నువ్వు చాలా అందంగా ఉంటావు అని , నీ స్నేహం నా అదృష్టం అనీ ఎపుడూ అంటాడు శాన్వి. మన క్లాస్ అవుతున్నప్పుడు అన్నయ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ క్లాస్ కూడా అటెండ్ అవ్వకుండా నిన్ను చూడడం కోసమే నాతో క్లాస్ లో కూర్చుంటాడు. మన ఇద్దరినీ ఎగ్జామ్స్ అవ్వగానే వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కి తీసుకు వెళతాను , ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు అన్నాడు తెలుసా ” ఇదీ ఆ మెసేజ్ సారాంశం. అంటే ఎపుడు లేనిది నా కూతురు గత నెలరోజుల నుంచీ తన ఫ్రెండ్ ఇంటికి తరచూ వెళ్ళడానికి కారణం ఇదా, పొత్తిళ్ళలో ఆడుకున్న నా బంగారు పాప ఇంత ఎదిగిపోయిందా అనుకున్న నాకు కళ్ళు మసకబారినట్టు అయిపొయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా ఇంట్లోనే ఉద్యోగం చేయకుండా ఉండిపోయినా ప్రపంచాన్ని చదివిన ఆడపిల్లనే కదా నేను కూడా , అందులోనూ ఆడపిల్ల తల్లిని. శాన్వి అయినా , అన్విత అయినా తప్పు ఒప్పులు అర్ధం చేసుకునేంత ఎదిగిన పిల్లలు కాదు. ఈ వయసులో ఎవరు కొంచెం ప్రేమగా పలకరించినా , కాస్త అభిమానం చూపించినా నిజానిజాలకి తేడా లేకుండా నమ్మే పసిమనసు ఇంకా వాళ్ళని వీడిపోదు. అందుకే వాళ్ళు అడిగినది ఏమి ఇవ్వకపోయినా తల్లితండ్రుల ప్రేమని శంకించే మాట్లాడతారు, వాళ్ళ వయసు పిల్లలకి అడిగినవన్నీ ఇచ్చే అమ్మ నాన్నలు మాత్రమే దేవుడు ఇచ్చిన వరాలు. ప్రస్తుతం నా కూతురు కూడా అదే స్థితిలో ఉంటాది, అందుకే మంచికీ చెడుకీ తేడా చెప్పే ప్రయత్నం మెల్లిగా చేయాలి అని నిర్ణయించుకుని, తనకి ఫోన్ చేసాను నాన్న ఆలస్యంగా వస్తారంట , ఒక్కదాన్నే ఉండాలి ఇంటికి వచ్చేయమ్మా అని. చాలా అయిష్టంగానే ఒప్పుకుని ఫోన్ పెట్టేసింది. నేను మెల్లిగా తన రూమ్ శాన్వి వెళ్ళినపుడు ఎలా ఉన్నాదో అలానే సర్దేసి బయటకి వచ్చేసాను. ఇంటికి వచ్చిన శాన్వి మోహంలో మొదటి సారి టీనేజ్ ఆడపిల్లల్లో ఉండే ఉత్సాహం , కొత్తగా తన ప్రపంచంలో తనకి నచ్చినది ఏదో దొరికింది అన్న సంతోషం చూసిన నేను , అదేమీ నా మొహం లో కనపడనివ్వకుండా జాగ్రత్త పడ్డాను.

ఆఫీస్ నుంచి వచ్చిన నా భర్త కి అంతా చెప్పి, ఇపుడు మనం తనకి ఏమి చెప్పినా నచ్చదు ప్రతి పేరెంట్స్ చెప్పే అడ్డు మాటలుగానే అనిపిస్తాయి, అవి మా మీద తనకి ద్వేషం పెంచే ప్రమాదం కూడా ఉంది , మనం చాలా జాగ్రత్తగా అలోచించి అడుగువేయాలి అని అర్ధం అయేలాగా వివరించాను. మర్నాడు శాన్వితో పాటు చదువుతున్న తన క్లాసుమేట్ వాళ్ళ అమ్మ కాంచన ని కలిసాను , అన్విత ఫ్యామిలీ డీటెయిల్స్ ఏమైనా తెలుసేమో అని మాటల్లో అడుగుదామని. కాంచన ద్వారా తెలిసిన విషయాలకి నాకు గుండెల్లో వణుకుగా అనిపించింది. అన్విత తండ్రి చాలా తాగుబోతు అని , పిల్లలని అసలు పట్టించుకోడు అని, తండ్రిని ఆలా చూసిన అన్విత అన్నయ్య కూడా జులాయిలా తయారయ్యాడు అని,ఒకసారి కాలేజీలో డ్రగ్స్ తీసుకుంటూ కూడా దొరికిపోతే 4 రోజులు లాక్ అప్ లో పెట్టారని చెప్పింది కాంచన.

తడబడే అడుగులతో ఇంటికి వచ్చిన నాకు ఒకటే దారి కనిపించింది. ఊహ తెలిసినప్పటి నుంచీ నన్ను నీడలా కాపాడుతూ వస్తున్న నా అన్నయ్య మాత్రమే ఈ సమస్యకి దారి చూపెట్టగలడని , మా కూతురి కి మా మీద ఏ మాత్రం ప్రేమ తగ్గకుండా మంచికీ చెడుకీ ఉన్న తేడా అర్ధం అయేలా చేయగలడని , అన్నయ్యకి అంతా చెప్పి తన మేన కోడలి బంగారు భవిష్యత్తు కాపాడమని అడగాలని గట్టిగా నిర్ణయించుకున్నాను.
ఈ రక్షాబంధనం రోజు నేను అన్నయ్యని నేను అడగపోయే బహుమతి నాకు మాత్రమే కాదు , మా అందమైన పొదరింటినే కంచు కోటలా కాపాడే కవచం అనుకుంటూ నా కూతురు వైపు చూసిన నాకు ఏ మాత్రం ఆందోళనగా అనిపించలేదు. అంతే కాదు అప్పటి వరకూ శాన్వి ఒక్కటే చాలు మాకు అనుకున్న నా నిర్ణయం కూడా మార్చుకున్నాను భవిష్యత్తులో తనకి కూడా తోడపుట్టిన వాళ్ళ అండ అవసరం అనీ , మేము ఆ దిశగా అడుగు వేయాలని . అదే మేము మా పాపకి ఇచ్చే గొప్ప కానుక అని .

Spread the love

Similar Posts

Leave a Reply

Your email address will not be published.